
విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి
కాగజ్‌నగర్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని అదనపు కలెక్ట ర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. కాగజ్‌నగర్ మండలం అనుకోడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరగతి గదిలో ఫౌండేషనల్ లెటర్స్ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక పద్ధతులు అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పర్శ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.