
జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం
గాడితప్పిన ఫైర్‌స్టేషన్ల నిర్వహణ
శిథిలావస్థలో భవనాలు.. సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ఫైరింజన్లు వెళ్లేసరికే కాలిబూడిదవుతున్న ఆస్తులు
జిల్లాలో ఐదేళ్లలో 164 అగ్ని ప్రమాదాలు
రూ.2.10 కోట్ల ఆస్తి నష్టం
ఆసిఫాబాద్: అగ్నిప్రమాదాల్లో రూ.లక్షల విలువైన ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే సేవలందుతుండగా, మారుమూల గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్ సకాలంలో చేరుకోకపోవడంతో ఆస్తులు కాలిబూడిదవుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, సరిపడా సిబ్బంది లేకపోవడంతో సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో 15 మండలాలకు ఒకే అగ్నిమాపక కేంద్రం ఉండగా, కాగజ్‌నగర్‌లో మరొకటి ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రం పరిధిలో 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణితోపాటు ఏజెన్సీ మండలాలు ఉండగా, కాగజ్‌నగర్ కేంద్రం ద్వారా కాగజ్‌నగర్, బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్, దహెగాం, సిర్పూర్(టి) మండలాలకు సేవలందిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంట పత్తి కావడంతో వివిధ ప్రాంతాల్లో సుమారు 30 వరకు జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. గత ఐదేళ్లలో జిల్లాలో 164 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోగా.. రూ.2,10,28,800 ఆస్తి నష్టం వాటిల్లింది. ఒకరు మృతి చెందారు.
శిథిలావస్థలో భవనాలు
జిల్లా కేంద్రంలో 1984లో అగ్నిమాపక కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వివేకానంద చౌక్ సమీపంలోని పాత గ్రామ పంచాయతీలో కార్యాలయం కొనసాగగా, అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట స్థలం కేటాయించి కొత్త కార్యాలయం నిర్మించారు. దశాబ్దాలు గడుస్తుండటంతో ఈ భవనం ప్రసుత్తం శిథిలావస్థకు చేరింది. స్లాబు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. మరోవైపు కాగజ్‌నగర్ పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయానికి సొంత భవనం లేదు. ఈజ్‌గాం రహదారిపై పాత నవోదయ భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం కొత్తగా ఆస్పత్రులు, పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, పరిశ్రమలతోపాటు అనేక ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ నిర్మాణ సమయంలో యజమానులు సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు సంబంధిత శాఖ అధికారులు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లా కేంద్రంలోని అగ్ని మాపక కేంద్రంలో 16 మంది సిబ్బందికి ప్రస్తుతం 10 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఐదు ఫైర్‌మెన్లు, ఒక ఫైర్ ఫిట్టర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో రెండు అగ్నిమాపక వాహనాలతో పాటు ఒక రెస్క్యూ వాహనం ఉంది. కాగజ్‌నగర్‌లో ఒక అగ్నిమాపక వాహనం, బుల్లెట్ బైక్ ఉంది. ఇరుకు వీధుల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు బు ల్లెట్ బైక్‌పై వెళ్లి మంటలార్పుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. శీతాకాలం, వేసవిలో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సర్వం కోల్పోతున్నాం
లింగాపూర్ మండలంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఆసిఫాబాద్ లేదా ఉట్నూర్, ఆదిలాబాద్ నుంచి ఫైరింజన్ రావాలి. అగ్నిప్రమాదాల్లో సర్వం కోల్పోతున్నాం. గతేడాది మామిడిపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో రైతు తెలంగ్‌రావు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పత్తితీత పనులు ప్రారంభమైతే ఇంట్లోనే నిల్వ చేసుకుంటారు. ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. – జాటోత్ రాహుల్, లింగాపూర్
సిబ్బంది కొరత ఉంది
జిల్లా కేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉంది. భవనం శిథిలావస్థకు చేరింది. జిల్లాలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే 87126 99190, 87126 99191 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్తున్నాం. – కార్తీక్, ఫైర్ అధికారి, ఆసిఫాబాద్