
చిన్నారులకు టీకా తప్పనిసరి
● డీఎంహెచ్‌వో సీతారాం
కెరమెరి(ఆసిఫాబాద్): రెండేళ్లలోపు చిన్నారులకు టీకా తప్పనిసరిగా వేయించాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. మండలంలో ని చౌపన్‌గూడ గ్రామంలో బుధవారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వ్యాధుల నివారణకు చిన్నారులకు టీకాలు వేయించాలని సూచించారు. రూ.5వేల విలువైన రక్త పరీక్షలు ప్రాథమిక కేంద్రాల్లో ఉచితంగా చేస్తారని, రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. నిల్వ నీటితో దోమలు వృద్ధి చెందుతాయని, మురుగునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. బాలింతలు, గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంవో శ్యాంలాల్, సీహెచ్‌వో సంపత్, హెచ్‌ఈవో సోము, సూపర్‌వైజర్ సంపూర్ణ, ఏఎన్‌ఎం వందన, హెచ్‌ఏలు వసంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.