
‘అడ’కు తాత్కాలిక మరమ్మతులు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ప్రధానమైన కుమురంభీం(అడ) ప్రాజెక్టు ఆనకట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.43 లక్షలు మంజూరు చేసింది. ప్రమాదకరంగా ఉన్న 200 మీటర్ల మేర కట్టపై పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
బీటలువారి.. ప్రమాదకరంగా మారి
రూ.882 కోట్ల అంచనాలతో ఆసిఫాబాద్ మండలంలో కుమురంభీం ప్రాజెక్టును నిర్మించారు. 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో 45,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రాజెక్టు 2011లో పూర్తికాగా, కొన్నేళ్లకే ఆనకట్టపై పగుళ్లు ఏర్పడ్డాయి. మట్టి కొట్టుకుపోకుండా నాలుగు సంవత్సరాల నుంచి ఆనకట్టపై కవర్లు కప్పి ఉంచుతున్నారు. ఆనకట్ట ఎత్తు 45 మీటర్లు కాగా, ప్రస్తుతం పైభాగం నుంచి రెండు, మూడు మీటర్ల లోతు వరకు పగుళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43 లక్షల నిధులు కేటాయించింది. బీటలువారిన 200 మీటర్ల పొడవు మేర ఆనకట్టపై మూడు మీటర్ల లోతు వరకు మట్టిని తొలగించి మళ్లీ గ్రావెల్‌తో నింపుతామని అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
మరిన్ని నిధులు కావాల్సిందే..
అడ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.688 టీఎంసీలు మాత్రం నిల్వ ఉంచుతున్నారు. డెడ్ స్టోరేజీ 1.423 టీఎంసీలు. మిగిలిన నీటినే సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బుధవారం ఇన్‌ఫ్లో 683 క్యూసెక్కులు ఉండగా ఒక గేటును 0.3 మీటర్లు పైకెత్తి 629 క్యూసెక్కులు కిందికి వదులు తున్నారు. 38 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ నీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.19 కోట్లు అవసరమని మూడేళ్ల క్రితం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నేటి వరకు నిధులు మాత్రం రాలేదు. ప్రస్తుతం వ చ్చిన నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనుండగా, కాలువల పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. మరిన్ని నిధులు ఇస్తేనే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందని రైతులు చెబుతున్నారు.
మిగిలిన ప్రాజెక్టులూ అంతే..
జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో పంట పొలాలు బీళ్లుగానే ఉంటున్నాయి. ప్రధానమైన ప్రాజెక్టులు వట్టివాగు, జగన్నాథ్‌పూర్ తదితర ప్రాజెక్టులు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం లేదు. పుష్కలంగా నీరున్నా కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు చేపట్టడం లేదు. ప్రధాన ప్రాజెక్టుల ద్వారా కేవలం 10 శాతం మాత్రమే సాగు నీరందుతుంది. జిల్లాలో చాలా మంది రైతులు ఆరుతడి పంటలకే పరిమితం అవుతున్నారు.
200 మీటర్ల మేర..
కుమురంభీం ప్రాజెక్టు ఆనకట్ట తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43లక్షలు మంజూరు చేసింది. దెబ్బతిన్న 200 మీటర్ల మేర ఆనకట్టపై పనులు చేపడతాం. వర్షాకాలం పూర్తయిన తర్వాత మరమ్మతులు ప్రారంభిస్తాం.
– గుణవంతరావు, ఇరిగేషన్ ఈఈ