
ఐలమ్మ స్ఫూర్తితో అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్‌అర్బన్: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి గా జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఇతర జిల్లా అధికారులతో కలిసి ఐలమ్మ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్, ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి సజీవన్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కడతల మల్లయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
ఆసిఫాబాద్‌రూరల్: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అడ గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ సౌజన్యంతో మత్స్యకారులకు వలలు, టార్చ్ లైట్లు, బోట్లు, పెట్టేలు, ఇతర పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ సీఈవో రాజేంద్రబాబు పాల్గొన్నారు.
పాఠశాలలకు ప్రొజెక్టర్లు అందజేత
జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో పది పాఠశాలలకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రొజెక్టర్లు పంపిణీ చేశారు. గత సంవత్సరం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెట్ సంస్థ సైన్స్ ల్యాబ్ వాహనం అందించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.