
లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్సు) కె.వెంకటేశ్వర్లు అన్నారు. ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డితో కలిసి బుధవారం ఖైరిగూర ఓసీపీని సందర్శించారు. ఓసీపీ వద్ద పనిస్థలాలు తనిఖీ చేశారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖైరిగూర ఓసీపీ వెళ్లే మార్గమధ్యలోని పావురాల గుట్ట వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. త్వరగా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా చేపట్టే గోలేటి ఓసీపీ పనుల పురోగతిని సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో పీవో మచ్చగిరి నరేందర్, ఎస్‌వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, గోలేటి ఓసీపీ పీవో ఉమాకాంత్, డీజీఎం సివిల్ ఎస్‌కే మదీనాబాషా, మేనేజర్ శంకర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.