పుస్తకం చదువుదాం రండి! | - | Sakshi
Sakshi News home page

పుస్తకం చదువుదాం రండి!

Sep 10 2025 3:51 AM | Updated on Sep 10 2025 3:51 AM

పుస్తకం చదువుదాం రండి!

పుస్తకం చదువుదాం రండి!

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా విద్యాశాఖ చర్యలు ప్రతిరోజూ 30 నిమిషాల సమయం పఠనం కోసం కేటాయింపు ఈ నెల 15 వరకు కొనసాగనున్న కార్యక్రమం

ఆసిఫాబాద్‌రూరల్‌: జైనూర్‌ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పదో తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకం చదవలేకపోవడంతో ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు చదవడంలో వెనుకబడిపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష రూం టు రీడ్‌ ఇండియా ట్రస్ట్‌ సహకారంతో విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిరోజూ పుస్తక పఠనానికి అరగంట కేటాయిస్తున్నారు. చదవడంపై ఆసక్తి కలిగించేలా ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

పాఠశాలల్లో గ్రంథాలయాలు..

జిల్లాలో 721 ప్రభుత్వ పాఠశాలు ఉండగా, 39,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతీ పాఠశాలలో ఉపాధ్యాయులు రోజుకో అరగంట సమయం పఠనానికి సమయం కేటాయిస్తున్నారు. విద్యార్థులకు వార్త పత్రికలతోపాటు కథల పుస్తకాలు, ఇతర సాహిత్యం, జీవిత చరిత్ర వంటి పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. రూమ్‌ టు రీడ్‌ ఇండియా సహకారంతో ఇటీవల ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన పుస్తకాల సేకరణతోపాటు గ్రంథాలయాల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ సైతం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆసక్తి పెంచాలి. పాఠశాల, గ్రామస్థాయిలో కథల రచన పోటీలు నిర్వహించాలి.

సృజనాత్మకత పెంచేందుకు..

పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకతతో చదవ డం, రాయడం వస్తే విద్యార్థులు చదువులో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ పెంచడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. సాహిత్య, కథల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఇది మేథో సామర్థ్యాన్ని పెంచడంలోనూ తోడ్పడుతుంది. విద్యార్థుల్లో విషయ అవగాహన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలని, అరగంటపాటు విద్యార్థులతో నచ్చిన పుస్తకాలు చదివించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషలపై పట్టు సాధించేందుకు ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement