
రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. ఏరియాలోని ఖైరగూర ఓసీపీ వద్ద రక్షణ, ప్రథమ చికిత్సపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 55వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా ఇటీవల బెల్లంపల్లి ఏరియాకు ప్రథమ చికిత్సలో సింగరేణి వ్యాప్తంగా మొదటి బహుమతి, రక్షణలో గ్రూప్ త్రీలో ప్రథమ బహుమతి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో బహుమతులు ప్రదర్శించారు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రక్షణ పరికరాలు ధరించకుండా పనులు చేయడం ప్రమాదమని పేర్కొన్నారు. ప్రథమ చికిత్సపై ప్రతీ ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఖైరగూర ఓసీపీకి బహుమతులు రావడంపై అధికారులు, ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిళి, పీవో మచ్చగిరి నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, సేఫ్టీ అధికారి గౌతమ్ రాజేశ్‌రెడ్డి, సంక్షేమ అధికారి రజినికుమార్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.