
కాలినడకన వెళ్లి.. సూచనలు చేసి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం డొంగర్‌గాం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని డీఎంహెచ్‌వో సీతారాం పరిశీలించారు. ఆ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో దొడ్డిగూడ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు గుట్ట ప్రాంతం గుండా సిబ్బందితో నడుచుకుంటూ వెళ్లారు. గ్రామస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. దోమలు వ్యాపించకుండా నిల్వ నీటిని తొలగించాలన్నారు. గర్భిణులు, బాలింతలు సకాలంలో టీకాలు తీసుకుంటే తల్లీబిడ్డకు అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.