యూరియా వెతలు | - | Sakshi
Sakshi News home page

యూరియా వెతలు

Sep 9 2025 8:39 AM | Updated on Sep 9 2025 1:06 PM

యూరియ

యూరియా వెతలు

రెబ్బెన, కాగజ్‌నగర్‌లో రైతుల ఆందోళనలు టోకెన్లు ఉన్నా బస్తాలు అందించడం లేదని అధికారులపై ఆగ్రహం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన

రెబ్బెన/కాగజ్‌నగర్‌రూరల్‌: యూరియా కోసం జిల్లా రైతుల వెతలు తీరడం లేదు. ఎరువులు వేసే అదును దాటిపోతుండటంతో అన్నదాతలు వ్యవసాయ సహకార సంఘాల కార్యాయాల ఎదుట బారులుదీరుతున్నారు. సరిపడా పంపిణీ చేయకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు వచ్చిన యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా సోమవారం అధికారులు కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 40 నిమిషాలపాటు రోడ్డుపై ధర్నా చేయడంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలకు మూడో దఫా మందులు వేయాల్సి ఉండగా యూరియా కోసం పీఏసీఎస్‌కు వచ్చామన్నారు. టోకెన్లు ఉన్నప్పటికీ యూరియా అందించకుండా కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలను వదిలేసి.. బస్తాల కోసం రోజుల తరబడి పీఏసీఎస్‌ చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. విషయం తెలుసుకున్న సీఐ సంజయ్‌ ఘటనాస్థలికి చేరుకుని రైతులకు సర్దిచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో వ్యవసాయ శాఖ, పీఏసీఎస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

కాగజ్‌నగర్‌లో ఆందోళన

యూరియా కోసం టోకెన్లు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు సోమవారం కాగజ్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. టోకెన్లు జూలై, ఆగస్టులోనే ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు బస్తాలు అందించలేదని ఆరోపించారు. సుమారు గంట వరకు ఆందోళన కొనసాగించారు.

‘ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు కష్టాలు’

కాగజ్‌నగర్‌రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు యూరియా కష్టాలు ఎదురవుతున్నాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో సోమవారం రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. జూలై, ఆగస్టులో టోకెన్లు ఇచ్చి ఇప్పటివరకు యూరియా పంపిణీ చేయకపోవడం సరికాదన్నారు. పొలాల్లో పని చేసుకోవాల్సిన రైతులు రోడ్లు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని చెబుతున్నారన్నారు. సరిపడా అందుబాటులో ఉంటే రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు యూరియా బస్తా ఒకటి రూ.700 చొప్పున బ్లాక్‌లో అమ్ముకుంటూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. లారీలు వచ్చినా బయోమెట్రిక్‌ మిషన్లు లేవనే కారణంతో యూరియా ఇవ్వడంలేదని, ఈ విషయాన్ని ఆయన జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వ్యవసాయ, పీఏసీఎస్‌ అధికారులతో మాట్లాడారు. దీంతో యూరియా బస్తాలను రైతులకు అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు లెండుగురె శ్యామ్‌రావు, కొంగ సత్యనారాయణ, మండల కన్వీనర్‌ అంజన్న, రాజు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

యూరియా వెతలు1
1/2

యూరియా వెతలు

యూరియా వెతలు2
2/2

యూరియా వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement