
పకడ్బందీ చర్యలు.. ప్రశాంత నిమజ్జనం
కౌటాల(సిర్పూర్): జిల్లాలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. గతేడాది కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగు వద్ద నిమజ్జనం సమయంలో ఇద్దరు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీస్ శాఖ ప్రత్యేక దృషి సారించింది. పక్కా ప్రణాళికతో పది రోజుల ముందు నుంచే శాంతికమిటీల సమావేశాలు నిర్వహించడంతోపాటు యువకులకు మండపాల ఏర్పాటుకు అనుమతులు, విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మండపాల వద్ద మద్యం తాగడం, పేకాటడం, అసభ్యకరమైన నృత్యాలను నిషేధించారు. అలాగే అమాయకులు మోసపోతున్నారని గుర్తించి ఈ ఏడాది లక్కీలాటరీలపైనా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం తగిన ఏర్పాట్లు చేసి వేడుకలు పూర్తి చేశారు. శోభాయాత్రలను ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తోపాటు ఏఎస్పీ చిత్తరంజన్ బైక్‌పై తిరుగుతూ రాత్రిపూట సైతం పర్యవేక్షించారు.
వెయ్యికిపైగా విగ్రహాలు
ఈ ఏడాది జిల్లాలో వెయ్యికి పైగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో అధికార యంత్రాంగం నిమజ్జనానికి వాగుల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా పరిధిలో మొత్తం 1,026 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయగా.. చివరి మూడు రోజుల్లోనే 900కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోలీసులు ప్రణాళిక ప్రకారం బ్లూకోల్డ్ సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్‌లతో గణపయ్య మండపం ఫొటో తీసి ఆన్‌లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేశారు. గణేశ్ శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి నిరాకరించారు. అలజడులు జరగకుండా రెండు రోజులపాటు వైన్స్‌లను మూసి మద్యం అమ్మకాలపై దృష్టి సారించారు. ఉత్సవాల్లో ఎస్పీతో పాటు అదనపు ఏస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలు, 8 మంది సీఐలు, ముగ్గురు ఆర్‌ఐలు, 19 మంది ఎస్సైలు, ఆరుగురు ఆర్‌ఎస్సైలు, 295 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. కీలకమైన కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో నిమజ్జన ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు సైతం చేపట్టారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నిమజ్జన ప్రక్రియను ఆదివారం వేకువజాము వరకు విజయవంతంగా పూర్తిచేశారు.
అందరి సహకారంతోనే..
జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనాలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేశాం. క్షేత్రస్ధాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేశాం. ఇదే స్ఫూర్తితో జిల్లావాసులు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ సహకరించాలి.
– కాంతిలాల్ పాటిల్, ఎస్పీ