
ప్రభుత్వ విధానాలతో పత్తి రైతులకు నష్టం
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలోని పత్తి రైతులకు రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యదర్శి రాజన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల కార్యదర్శులు రవి, మల్లేశ్‌తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పత్తి పంటపై 11 శాతం టారిఫ్‌ను సున్నకు తగ్గించడంతో దేశంలోని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికా వంటి దేశాల నుంచి దేశానికి పత్తి పోటెత్తితే స్థానిక పంటకు సరైన ధర దక్కదన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్దిష్ట విధానం లేకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ సిబ్బంది వ్యవహారంపై ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ జిల్లాకు ప్రాణాధారమైన అడ ప్రాజక్టుకు మరమ్మతులు లేకపోవడంతో 45వేల ఎకరాలకు కనీసం నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దుర్గం దినకర్, కార్తీక్, రాజేందర్, ఆనంద్, టీకానంద్ పాల్గొన్నారు.