
‘జీఎస్టీ స్లాబ్ మార్పులతో ఊరట’
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ స్లాబ్ మార్పులు పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగిస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ సామాన్యులకు బీజేపీ ప్రభుత్వం వస్తుసేవలపై పన్ను(జీఎస్టీ)లో మార్పులు తీసుకురావడంతో నూనెలు, టీవీలు, ఆరోగ్య ఉత్పత్తులు, హెల్త్ ఇన్సురెన్స్‌ల వంటి వాటిపై జీఎస్టీ పన్నుభారం తగ్గుతుందన్నారు. ప్రధానంగా విద్యా సామగ్రిపై జీఎస్టీ 12 శాతం ఉండగా పూర్తిగా తొలగించిందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, మండల అధ్యక్షుడు అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నాయకులు కిరణ్, బేబీ, చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, మనోహర్‌గౌడ్, రమేశ్, అరుణ్‌లోయ పాల్గొన్నారు.