డెంగీ పంజా..! | - | Sakshi
Sakshi News home page

డెంగీ పంజా..!

Sep 4 2025 6:03 AM | Updated on Sep 4 2025 9:43 AM

డెంగీ పంజా..!

డెంగీ పంజా..!

● జిల్లాలో విజృంభిస్తున్న జ్వరం ● బుధవారం ఆరు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ

కౌటాల: జిల్లా వాసులపై డెంగీ పంజా విసురుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విజృంభిస్తోంది. కౌటాల, చింతలమానెపల్లి, తిర్యాణి, లింగాపూర్‌, ఆసిఫాబాద్‌ మండలాల్లో బాధితులు పెరుగుతున్నారు. బుధవారం మరో ఆరు కేసులు నమోదయ్యాయి. తిర్యాణి మండలం అమీన్‌గూడ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతితోపాటు తిర్యాణి మండలం చింతపల్లికి చెందిన 21 యువకుడు, తిర్యాణి మండలం సోనాపూర్‌కు చెందిన 24 ఏళ్లు యువకుడు, లింగాపూర్‌ మండలం మామిడిపల్లికి చెందిన 16 ఏళ్ల బాలిక, లింగాపూర్‌ మండల కేంద్రానికి చెందిన 13 ఏళ్ల బాలుడు, తిర్యాణి మండలం గంభీరావ్‌పేటకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు డెంగీ బారిన పడ్డారు.

అనధికారికంగా ఎక్కువే..

జిల్లాలో రోజురోజుకూ డెంగీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అధికారికంగా ఈ సీజన్‌లో 41 కేసులు నిర్ధారణ కాగా.. అనధికారికంగా ఎక్కువే ఉంటాయి. పీహెచ్‌సీల్లో నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాలు లేకపోవడంతో తక్కువగా కేసులు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జ్వరాల సోకినవారు పరీక్షలకు సైతం ముందుకు రావడం లేదు. వసతి గృహాల్లో జ్వరంతో బాధపడే విద్యార్థులను ముందు జాగ్రత్తగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇళ్లకు పంపిస్తున్నారు. డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌ గున్యా వ్యాధులు దోమల కారణంగానే వ్యాప్తి చెందుతున్నా క్షేత్రస్థాయిలో సరైన చర్యలు కరువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఐదారు రోజుల్లో లక్షణాలు

డెన్‌– 1, 2, 3, 4 అనే నాలుగు రకాల వైరస్‌ల కారణంగా డెంగీ జ్వరం వస్తుంది. ఏడిస్‌ ఈజిప్టై అనే దోమకాటుతో ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దోమలు కుట్టిన ఐదారు రోజుల్లో లక్షణాలు రోగికి కనిపిస్తాయి. మొదటి రకం సాధారణం కాగా, హెమరేజిక్‌ ఫీవర్‌ ప్రమాదకరమైనది. ప్లేట్‌లేట్ల సంఖ్య పడిపోవడం ఒక్కోసారి రక్తస్రావానికి దారి తీస్తుంది. మన రక్తంలో ప్లేట్‌లేట్ల సంఖ్య 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది. వీటి సంఖ్య కనిష్ట స్థాయికి పడిపోతే వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు భావిస్తారు. ఈ విషయమై కౌటాల మెడికల్‌ ఆఫీసర్‌ నవతను సంప్రదించగా, జ్వరంతో బాధపడితే తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పోషకాహారం తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement