
వంటకు తాజా కూరగాయలు వాడాలి
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థుల వంట కోసం తాజా కూరగాయలు వాడాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించారు. వంట గది, పరిసరాలు, సరుకులు, స్టాక్ రిజిస్టర్, మరుగుదొడ్లు, పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించి, విద్యాప్రమాణాలను పరిశీలించారు. అనంతరం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. గైర్హాజరవుతున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్షిక పరీక్షలకు పదో తరగతి విద్యార్థులను ఇప్పటినుంచే సన్నద్ధం చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్: వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖదీమజీద్, కసాబ్‌వాడి కాలనీల్లోని అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ గజానంద్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ దోమల నివారణకు డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు పూడ్చివేయాలన్నారు. నష్టాలపై నివేదిక సమర్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంలోని పెద్దవాగు వద్ద నిమజ్జన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. శోభాయాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుద్దీపాలు, క్రేన్, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.