
పకడ్బందీగా సంక్షేమ పథకాలు అమలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ శాఖ, విద్యా, మున్సిపల్ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వందశాతం నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించాలని, పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పనికల్పించాలని, పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల హాజరుపై ఎంపీడీవోలు, ఎంపీవోలు పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, అధికారులు పాల్గొన్నారు.