
అనుమతి లేకుండా నీలగిరి చెట్లు నరికివేత
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి ఎక్స్‌రోడ్ నుంచి గోలేటి టౌన్‌షిప్ వైపు మార్గంలోని సింగరేణి రోడ్డుకు ఇరువైపులా యాజమాన్యం గతంలో నీలగిరి మొక్కలు నాటింది. ఈ దారిలో పులికుంట వాగు ఒడ్డున సింగరేణి సంస్థకు చెందిన భారీ నీలగిరి వృక్షాలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. సమాచారం అందుకున్న సింగరేణి సెక్యూరిటీ అధికారి శ్రీధర్, ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది బుధవారం చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. మూడు భారీ నీలగిరి చెట్లు నరికినట్లు గుర్తించారు. రోడ్డు పక్కన సింగరేణి యాజమాన్యం పెంచిన వృక్షాలను అనుమతి లేకుండా నరికివేయడంతోపాటు కొత్తగా నిర్మిస్తున్న జిన్నింగ్ మిల్లు సమీపంలో చెట్లను ముక్కలు చేసి మాయం చేసినట్లు నిర్ధారించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని సెక్యూరిటీ అధికారి తెలిపారు.