
49 జీవో శాశ్వత రద్దుకు పోరాటం
● సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు
కాగజ్‌నగర్‌టౌన్: జీవో 49 శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణం సర్‌సిల్క్ కాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో బంద్ సంపూర్ణం కావడంతో ప్రభుత్వం దిగివచ్చి జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెమో ఇచ్చిందన్నారు. తాత్కాలికంగా నిలుపుదల చేయడం కేవలం కంటి తుడుపు చర్యని, శాశ్వత రద్దు కోసం పోరాటాలు విరమించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే జీవో తెచ్చామని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలికారని, ప్రస్తుతం తాత్కాలికంగా నిలుపుదల ఆర్డర్స్ కోసం కేంద్రాన్ని సంప్రదించారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేని అంశంలో బీజేపీని లక్ష్యం చేసి విమర్శలు గుప్పించారని మండిపడ్డారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని, ఈ నెలాఖరులోగా జీవో రద్దు చేయని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, కోశాధికారి అరుణ్‌లోయ, నాయకులు విశ్వేశ్వర్‌రావు, సిందం శ్రీనివాస్, బాల్క శ్యామ్, మనోహర్‌గౌడ్, చిప్పకుర్తి శ్రీనివాస్, తిరుపతి, సాంబయ్య, గణపతి, లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.