కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన నాగేశ్వర్, జయ దంపతుల కుమార్తె మన్విత స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటుంది. ఈ నెల 15న జ్వరం రాగా కౌటాల పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మళ్లీ 16వ తేదీన పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ‘ఏడేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా..’ అంటూ తల్లిదండ్రులు రోదించడం స్థానికులను కలచివేసింది.
దహెగాం(సిర్పూర్): పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పింది. ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు నిలవడం, చెత్తకుప్పలు పేరుకుపోయి ఉండడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. ఓ వర్షాలు పడుతుండగా మరోవైపు ఎండ తీవ్రత, ఉక్కపోతతో భిన్న వాతావరణం ఉంది. ఫలితంగా విష జ్వరాల ముప్పు పొంచి ఉంది. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు జ్వరంతో మృతి చెందారు. గతేడాది ఫిబ్రవరి 2న సర్పంచుల కాలం ముగియగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు. గతేడాది నవంబర్‌లో మాత్రమే కొంతమేర నిధులు అందాయి. అప్పటినుంచి నయా పైసా రాకపోవడంతో పాలన ఇబ్బందిగా మారింది.
17 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన..
సర్పంచుల పదవీ కాలం ముగిసి 17 నెలలు కావొ స్తోంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలానికి ఒక ప్రత్యేకధికారి, పంచాయతీలకు కూడా 125 మంది ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టారు. ఒక్కో అధికారి రెండు నుంచి నాలుగు పంచాయతీలు బా ధ్యత చూస్తున్నారు. దీంతో వారు పంచాయతీలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏజెన్సీ మండలాల్లో ర్యాఫిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు అయితే మలేరి యా, డెంగీ వంటి కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య అధికారులు వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోకపోతే రానున్న రెండు నెలల్లో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ఫాగింగ్‌తోపాటు చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ
మురుగు నీటి నిల్వతో దోమలు, ఈగలు వృద్ధి
జాడలేని ఫాగింగ్, బ్లీచింగ్ పనులు
వారం రోజుల వ్యవధిలో జ్వరంతో ఇద్దరు మృతి
తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన మహిళ పాండుబాయి వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా జ్వరం తగ్గకపోగా, రక్తకణాలు కూడా పడిపోయాయి. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. ఐదు రోజులపాటు చికిత్స పొందగా, పరిస్థితి విషమించి ఈ నెల 19న ప్రాణాలు కోల్పోయింది.
గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ..
పంచాయతీల్లో నిధుల లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పింది. మురుగు నీరు రోడ్లపై పారుతోంది. గ్రామాలతోపాటు మండల కేంద్రాల్లో కూడా ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారుతున్నాయి. 5,000 బస్తాల బ్లీచింగ్ పౌడర్ అవసరం ఉంటుంది. నిధులు లేక మురుగు నీటిపై కనీసం బ్లీచింగ్ ఫౌడర్ కూడా చల్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల నివారణకు కొనుగోలు చేసిన దాదాపు 250 ఫాగింగ్ యంత్రాలు మూలనపడ్డాయి. దోమల నివారణ మందు పిచికారీ చేయాలంటే రోజుకు కనీసం 10 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. డీజిల్ కొనుగోలుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎస్‌ఎఫ్‌సీ రాష్ట్ర ఆర్థిక నిధులు, కేంద్రం నుంచి ఎఫ్‌ఎఫ్‌సీ 15 ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. పంచాయతీల్లో పన్నులను బ్యాంకులో జమ చేయగా.. వాటిని కూడా పారిశుద్ధ్య పనుల కోసం వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు
వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాం. పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
– భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి
సిబ్బందిని అప్రమత్తం చేశాం
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశాం. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏజెన్సీలో ర్యాఫిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. మలేరియా, డెంగీ కేసులు లేవు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– సీతారాం నాయక్, డీఎంహెచ్‌వో
స్వచ్ఛతపై పట్టింపేది?
స్వచ్ఛతపై పట్టింపేది?