
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలన్నారు. దరఖాస్తుల తిరస్కరణకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారుల వివరాలను ఈ నెల 30 లోగా పంపించాలని ఆదేశించారు. ఈ నెల 27న జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అర్హులకు కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తున్నామన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో 44 శాతం పూర్తి చేశామన్నారు. సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ వేగవంతం చేశామని, ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో అటవీ శాఖ అధికారి దేవిదాస్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఎంహెచ్‌వో సీతారాం, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి నదీమ్, హౌజింగ్ పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు.