
‘సమస్యలపై దశలవారీగా పోరాటం’
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీగా పోరాటం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి(యూఎస్‌పీసీ) నాయకులు ప్రకటించారు. పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో సోమవారం యూఎస్‌పీసీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ యూఎ స్‌పీసీ ఆధ్వర్యలో ఈ నెల 23, 24 తేదీల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని, ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నా, 23న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ విడుదల చేసి, ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. నూతన జిల్లాలకు డీఈవో పోస్టులతోపాటు ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ డీవో, మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీఎస్ హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయాలని, పండిత్, పీఈటీల అప్‌గ్రేడేషన్ పూర్తయినందున జీవో 2, 3, 9, 10 రద్దు చేసి, జీవో 11, 12 ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. గురుకులాల టైం టేబుల్ సవరించాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలానికి జీతం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చరణ్‌దాస్, వైద్య శాంతికుమారి, లక్ష్మణ్, జాడి కేశవ్, రాజ్‌కమలాకర్‌రెడ్డి, సురేశ్, మహేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.