
పోలీసులకు చిక్కిన ‘ఆంధ్రా సురేశ్’
● నకిలీ విత్తనాల కేసులో పీడీ యాక్టు నమోదు ● చర్లపల్లి జైలుకు తరలింపు
ఆసిఫాబాద్‌అర్బన్/చింతలమానెపల్లి: నకిలీ విత్తనాల సరఫరా కేసుల్లో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన గోరంట్ల సురేశ్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. శనివారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వివరాలు వెల్లడించారు. నకిలీ విత్తనాల సరఫరా కేసులో నిందితుడు సురేశ్‌పై చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 4న కేసు నమోదైంది. ఈ నెల 3న రవీంద్రనగర్– 1 సమీపంలో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. 2018 నుంచి 2025 వరకు నకిలీ విత్తనాల సరఫరాకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో అతడిపై పీడీ యాక్టు నమోదు చేశారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్ ఆధ్వర్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం భీమవరానికి చెందిన గోరంట్ల సురేశ్‌బాబు జిల్లాలోని చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ మండలాల్లో నమోదైన నకిలీ విత్తనాల సరఫరా కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా మళ్లీ తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. శాశ్వత చర్యల్లో భాగంగా పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. కాగా, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమినితోపాటు జిల్లాలోని చింతలమానెపల్లి, దహెగాం మండలాలకు ఈ ఏడాది నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో ఆయా పోలీస్‌స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. ‘ఆంధ్రా సురేశ్ ఎవరు?’ అంటూ ‘సాక్షి’లో ‘నకిలీ ముప్పు’ పేరుతో కథనం కూడా ప్రచురితమైంది. నిందితుడిపై రామగుండం కమిషనరేట్ పరిధిలోనూ కేసులు నమోదై ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. జిల్లాలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంటుందని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.