
వసతుల కల్పనకు చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఐఈవో కళ్యాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్‌డీవో దత్తారావు, పంచాయతీరాజ్ డీఈ కృష్ణతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల కల్ప న, అదనపు గదుల నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారులు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో తాగునీరు, మూత్రశాలలు, భవనాలకు మరమ్మతు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, కంప్యూటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు ఇతర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్పిరేషనల్ బ్లాక్‌లో భాగంగా తిర్యాణి మండలంలో రహదారుల అభివృద్ధి, పాఠశాలల్లో వసతులు కల్పించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలల నిర్మాణాలు, విద్యుదీకరణ, భవనాల పెయింటింగ్ పనులు చేపట్టాలని సూచించారు. గతంలో ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.