
కొరత లేదు
యూరియా
● జిల్లాలో 6,400 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది ● రైతులెవరూ ఆందోళన చెందొద్దు ● నెలాఖరు వరకు సరిపడా నిల్వలు ● మోతాదుకు మించి వినియోగించొద్దని సూచన ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఏవో రావూరి శ్రీనివాసరావు వెల్లడి
సాక్షి, ఆసిఫాబాద్: ‘వానాకాలంలో జిల్లాలోని రైతులు ప్రధానంగా పత్తి, సోయా, కంది, వరి పంటలు సాగు చేస్తున్నారు. యాసంగిలో మొక్కజొన్న, జొన్న పంటలు పండిస్తున్నారు. పంటల్లో అధిక దిగుబడి సాధించాలని, మొక్కలు ఏపుగా పెరగాలనే ఉద్దేశంలో రైతులు యూరియాను విచక్షణారహితంగా వినియోగించడంతో నేల పాడవడమే కాక.. పర్యావరణానికి హాని కలుగుతోంది. ఇది ధరిత్రికి, రైతులకు మంచిది కాదు. ప్రస్తుతం జిల్లాలో యూరియా కొరత లేదు. అధికంగా యూరియా వాడితేనే పంట ఏపుగా పెరుగుతుందనే అపోహాతో ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారు. అయినా ఈ నెలాఖరు వరకు సరిపడా ని ల్వలు ఉన్నాయి.’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) రావూరి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.
సాక్షి: జిల్లా రైతులు వానాకాలంలో ఏ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు? పంటల సాగు అంచనా ఎంత?
డీఏవో: జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని 4.45 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని అంచనా వేశాం. ఇందులో ప్రధానంగా పత్తి 3.35 లక్షల ఎకరాలు, వరి 55 వేలు, కంది 32 వేలు, పెసర, సోయా, ఇతర హార్టికల్చర్ పంటలు మరో 23వేల వరకు ఉంటాయి.
సాక్షి: యూరియా కొరతతో జిల్లాలో రైతులు బ్లాక్‌లో ఎరువులు కొనాల్సిన పరిస్థితులు ఉంటు న్నాయి? నిజంగా జిల్లాలో కొరత ఉందా?
డీఏవో: జిల్లాలో పంట సాగుకు అనుగుణంగా 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 45 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 20 వేల మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరమవుతుందనే అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అలాగే కాంప్లెక్స్ 18 వేలు మె.టన్నులు, పొటాష్ 230 మెట్రిక్ టన్నులు దిగుమతి అయ్యింది.
సాక్షి: గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఎరువులు పంపుతోంది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
డీఏవో: కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం, నేల ఆరోగ్యం కాపాడాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే యోచన చేస్తోంది. గతంలో ఒకేసారి ఎరువులు దిగుమతి అయ్యేవి. రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగించడం అలవాటు చేసుకున్నారు. దీనిని గమనించిన కేంద్రం.. ఇప్పుడు నెలవారీగా రైతులకు సరిపడా మాత్రమే ఎరువులను రాష్ట్రాలకు పంపిస్తోంది.
సాక్షి: ఇప్పటివరకు జిల్లాలో ఎంత యూరియా నిల్వ ఉంది? ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఎంత అవసరం పడుతుంది?
డీఏవో: జిల్లాలో 6400 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. ఇది ఈ నెలాఖరు వరకు సరిపోతుంది. ఆగస్టుకు సంబంధించి 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఇండెంట్‌ను సర్కారుకు పంపించాం. సెప్టెంబర్‌కు సంబంధిచిన ఎరువులు ఆగస్టు నెలాఖరున వస్తాయి.
సాక్షి: మోతాదుకు మించి యూరియా వాడితే జరిగే నష్టమేంటి?
డీఏవో: రైతులు విత్తనం వేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు వినియోగించాలి. అంతేకానీ మొక్క వచ్చాక కూడా వాటిని వినియోగించరాదు. ఒక ఎకరానికి 90 కేజీల నుంచి 120 కేజీల వరకు వినియోగిస్తే సరిపోతుంది. కానీ జిల్లాలో ఎకరాకు రెండు, మూడు బస్తాలు వినియోగిస్తున్నారు. దీంతో నేల ఆరోగ్యం పాడవడమే కాకుండా చీడపీడల ఉధృతి పెరుగుతుంది. ఫలితంగా ఆశించిన దిగుబడులు రాకపోవచ్చు.
సాక్షి: నానో యూరియా ఎప్పుడు వినియోగించాలి? దాని వల్ల ఉపయోగాలేంటి?
డీఏవో: యూరియాకు బదులుగా రెండో దఫాలో నానో యూరియా స్ప్రేను రైతులు వినియోగించాలి. ఎకరాకు అర లీటరు చొప్పున వాడాలి. రెండు విడతలు వాడితే సరిపోతుంది. దీని వల్ల భూసారం దెబ్బతినదు.
సాక్షి: జిల్లా చాలామంది రైతులు కాంప్లెక్స్, పొటాష్ వినియోగించడం లేదు? ఎందుకు?
డీఏవో: వాస్తవానికి యూరియాతోపాటు పంటలకు పొటాష్, భాస్వరం ఇతర కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉంటుంది. పొటాష్ తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల మొక్క ధృడంగా పెరుగుతుంది. అయితే వీటి ధర ఎక్కువగా ఉండటంతో రైతులు పెద్దగా మొగ్గు చూపడం లేదు.

కొరత లేదు