
ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు చర్యలు
ఆసిఫాబాద్: ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా రూ.5 లక్షలతో సమకూర్చిన 4 సీట్లతో కూడిన బోటు, 50 లైఫ్ జాకెట్లు, 20 రబ్బర్ ట్యూబులు, ఒక కోత యంత్రాన్ని మంగళవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి పోలీస్, అగ్నిమాపక శాఖలకు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజల రక్షణ, ఆస్తులు నష్టపోకుండా సత్వరమే రెస్క్యూ చేసేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పోలీస్, అగ్నిమాపక శాఖల్లో 15 మందితో కూడిన శిక్షణ సిబ్బంది ఉన్నారన్నారు. గతంలో విపత్తులు సంభవించినప్పుడు మంచిర్యాల నుంచి సిబ్బంది వచ్చేవారని, ఇప్పుడు జిల్లాలోనే అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.