
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర వసతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా అర్థమయ్యేలా బోధించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల వ్యాప్తిని అడ్డుకుని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వంటగది, స్టోర్‌రూం, మరుగుదొడ్లు నిత్యం శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.