
సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్: రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉచిత ఇసుక సరఫరా, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, విత్తనాలు, ఎరువుల నిర్వహణ, వన మహోత్సవం– 2025 లక్ష్య సాధన, ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన, సీజనల్ వ్యాధుల నివారణ, టీబీ నిర్మూలన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.30 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భారీ వర్షాలకు ముందే గ్రౌండ్ లెవల్ పనులు పూర్తయ్యేలా చూ డాలన్నారు. ఆగస్టు 15 నాటికి భూభారతి దరఖా స్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్ట ర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివా రి, ఎం.డేవిడ్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు మొదటి విడతగా 5,598 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 1500 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉచితంగా ఇసుక అందిస్తున్నామన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు 14 మండలాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 4,111 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. జిల్లాలో 1000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌వో సీతారాం, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, గృహనిర్మాణశాఖ పీడీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.