నర్సరీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
రెబ్బెన: రెబ్బెన ఫారెస్ట్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది నర్సరీలో పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. పలుమార్లు అధికారులు, డీఎఫ్‌వో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వేతనాలు అడిగిన ప్రతిసారి రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. ఏడాదికాలంగా వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నారన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డీఎఫ్‌వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు దశరథ్, చిన్నక్క, సరిత, సుమలత, తదితరులు పాల్గొన్నారు.


