బదిలీలతో ఇక్కట్లు!? | - | Sakshi
Sakshi News home page

బదిలీలతో ఇక్కట్లు!?

May 28 2025 11:51 AM | Updated on May 28 2025 11:51 AM

బదిలీ

బదిలీలతో ఇక్కట్లు!?

● రిలీవ్‌ కాకుండా విధులకు తహసీల్దార్లు డుమ్మా ● నాలుగు మండలాల్లో నిలిచిన ధ్రువపత్రాల జారీ ● ఎఫ్‌ఏసీగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వని రెవెన్యూ అధికారులు ● సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల వద్ద ప్రజల పడిగాపులు ● సోమవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్‌ చేసిన కలెక్టర్‌

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు సామాన్య ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. బదిలీ అయిన తహసీల్దార్లను జిల్లా కలెక్టర్‌ సోమవా రం రాత్రి వరకు రిలీవ్‌ చేయలేదు. అయితే వారు తమ కార్యాలయాలకు వెళ్లకపోవడంతో పాలనపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, క ళాశాలలు తెరిచే సమయంలో విద్యార్థులకు కులం, నివాసం, ఈబీసీ, ఓబీసీ ధ్రువపత్రాలు, భూముల లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఎల్‌టీఆర్‌, ఇతర పరిశీలన సంబంధిత అంశాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 13 రోజులుగా ప్రజలు, విద్యార్థులు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

సుముఖత చూపని వైనం..

గత ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి పలువురు తహసీల్దార్లు పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో కొందరు తిరిగి జిల్లాకు రాగా.. మిగిలిన వారు మళ్లీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపలేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లు తమ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించడంతో ఈ నెల 15 అందరినీ బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిర్పూర్‌(యూ), కెరమెరి, ఆసిఫాబాద్‌ మండల తహసీల్దార్లతోపాటు కలెక్టరేట్‌ ఎన్నికల విభాగంలో పనిచేసే ఒకరు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో మరో నలుగురిని ఇక్కడికి కేటాయించారు. ఒకరు మరుసటి రోజే బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించుకోగా.. మరో అధికారి సరస్వతీ నది పుష్కర విధుల్లో ఉన్నారు. ఒక అధికారి ఇక్కడ వచ్చి రిపోర్టు చేయకుండా వేచిచూసే ధోరణిలో ఉండగా.. మరొకరు మాత్రం కలెక్టర్‌ వద్ద రిపోర్ట్‌ చేశారు.

భారీస్థాయిలో పైరవీలు..

జిల్లాలో ఖాళీ ఏర్పడిన స్థానాల్లో నూతనంగా తహసీల్దార్లను నియమించకపోవడం వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లే కారణమన్న చర్చ జరుగుతోంది. జిల్లాకు వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులకు వెళ్లడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బదిలీపై వచ్చిన అధికారులు సైతం కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందువల్లే ఇక్కడికి వచ్చి రిపోర్టు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రం, ఆదాయ వనరుగా పేరున్న ఆసిఫాబాద్‌ మండల తహసీల్దారుగా పనిచేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో 15 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని కోరుతూ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్‌ సైతం బదిలీల అంశంపై కసరత్తు చేసినట్లు తెలిసింది. జిల్లాలో పనిచేయని తహసీల్దార్లను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాలుగు మండలాలతోపాటు మరికొన్ని మండలాల్లోనూ తహసీల్దార్లు బదిలీ కావచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

తలచిందొకటి.. జరిగిందొకటి!

కలెక్టర్‌ బదిలీ అయిన తహసీల్దార్లకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇస్తే.. పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో వారిని ఆపి ఉంచారు. సదరు అధికారులు మాత్రం 13 రోజులపాటు విధులకు హాజరు కాకుండా పాలన కుంటుపడేలా చేసి జిల్లా సర్వోన్నతాధికారి ఉద్దేశానికి తూట్లు పొడిచారు. బదిలీ అయిన తహసీల్దార్లు ఎవరూ కార్యాలయాలకు వెళ్లడం లేదని ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ.. వారి స్థానంలో డీటీలకు ఎఫ్‌ఏసీ ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. లింగాపూర్‌, సిర్పూర్‌(యూ), కెరమెరి, ఆసిఫాబాద్‌ మండల కార్యాలయాల్లో ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బదిలీల అంశంపై ఉన్నతస్థాయి, రాజకీయ ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో సోమవారం రాత్రి హడావుడిగా నలుగురు తహసీల్దార్లను రిలీవ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో ఎఫ్‌ఏసీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం ఆసిఫాబాద్‌ మండలానికి మాత్రం డీటీ పోచయ్యకు తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఆయా స్థానాల్లో పూర్తిస్థాయి తహసీల్దార్లను నియమించనున్నారని సమాచారం.

బదిలీలతో ఇక్కట్లు!?1
1/1

బదిలీలతో ఇక్కట్లు!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement