‘నో డ్యూస్‌’ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

‘నో డ్యూస్‌’ తప్పనిసరి

Published Thu, Nov 9 2023 12:16 AM

మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయం - Sakshi

● ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎలాంటి బకాయిలు ఉండొద్దు ● మున్సిపల్‌, జీపీల్లో ఇంటి, నల్లా, ఇతర పన్నులు చెల్లించాలి

మంచిర్యాలటౌన్‌: ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే వారి పేరిట ఉన్న ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడం తప్పనిసరి. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఆస్తులు కలిగి ఉన్న ప్రధాన పార్టీల నాయకులు వారి పేరిట ఉన్న ఆస్తుల ట్యాక్స్‌లను ఇప్పటికే చెల్లించారు. ఇతర పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారితో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వారు సైతం పన్నులు చెల్లిస్తున్నారు. ఎక్కువగా మున్సిపాలిటీ పరిధిలోనే పలువురు అభ్యర్థులు నివాసం ఉండడంతో బకాయిలను పూర్తిగా చెల్లించి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఇప్పటికే కొందరు నామినేషన్లను వేయగా మరికొందరు ఈ నెల 10లోగా వేసేందుకు సిద్ధమవుతున్నారు.

రూ.7.40 లక్షల ఆదాయం

నోడ్యూస్‌ చెల్లింపుల్లో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీలో 21 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆస్తిపన్ను రూ.4.08,127, నల్లా పన్ను రూ.94,280 వరకు మొత్తం మున్సిపాలిటీకి రూ.5,02,407 ఆదాయం వచ్చింది. ఇందులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఎల్‌ఐసీ కాలనీలోని తన ఇంటిపన్ను రూ.15,078, నీటిపన్ను రూ.3,600 చెల్లించారు. తన తండ్రి నడిపెల్లి లక్ష్మణ్‌రావు పేరిట పాతమంచిర్యాలలోని ఇంటిపన్ను రూ.8,743, నీటిపన్ను రూ.18 వేలు చెల్లించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు హైటెక్‌సిటీలోని తన ఇంటిపన్ను రూ.1,11,844, వాటర్‌ చార్జీలు రూ.3,600 చెల్లించారు. బీజేపీ అభ్యర్థి రఘునాథ్‌రావు వెరబెల్లి హైటెక్‌సిటీ కాలనీలోని తన ఇంటిపన్ను రూ.6,380, వాటర్‌ చార్జీలు రూ.9 వేలు చెల్లించారు. నస్పూరు మున్సిపాలిటీలో ఐదుగురు నో డ్యూస్‌ సర్టిఫికెట్లు తీసుకున్నారు. మంచిర్యాల నుంచి బీఎస్పీ అభ్యర్థి తోట శ్రీనివాస్‌ ఇంటిపన్ను రూ.531, చెన్నూర్‌ నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్న వడ్లకొండ రాజం రూ.302 ఆస్తిపన్ను చెల్లించారు. చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించిన ఆస్తిపన్ను రూ.1,97,820, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోని తన ఇంటిపన్ను రూ.20 వేలు చెల్లించి నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారు. మందమర్రి మున్సిపాలిటీ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తన రెండిళ్లకు రూ.1,022, నూకల రమేశ్‌ రెండిళ్లకు రూ.1,907 ఇంటిపన్ను చెల్లించారు. లక్సెట్టిపేట్‌ మున్సిపాలిటీ పరిధిలో హనుమాండ్ల శంకర్‌కు ఇల్లు లేకపోవడంతో నో డ్యూస్‌ తీసుకుని నామినేషన్‌ వేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి ఐదుగురు రూ.5 వేలు చెల్లించి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారు.

Advertisement
Advertisement