దహెగాం(సిర్పూర్): పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఆర్థికంగా సాయమందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. ప్రారంభంలో ఎకరానికి రూ.4వేలు ఇవ్వగా, ప్రస్తుతం ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు సార్లు అందజేస్తున్నారు. అయితే జిల్లాలోని పలువురు రైతులకు సాంకేతిక కారణాలతో ఇప్పటివరకు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయం ఖాతాల్లో జమ కాలేదు. పదెకరాల పైన భూమి ఉన్న వారికి ఈ సమస్య తలెత్తుతోందని రైతులు చెబుతున్నారు.
రైతులకు ఎదురుచూపులు..
డిసెంబర్‌లో యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగా ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు.. ఇ లా పదెకరాల వరకు దశల వారీగా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసింది. అయితే పదెకరాల పైన భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందలేదని తెలుస్తోంది. అందులో కూడా కొందరికి జమ అయినట్లు రైతులు చెబుతున్నారు. ఏ కారణంతో నగదు జమ కాలేదో వ్యవసాయ శాఖాధికారులకు కూడా సమాచారం లేదు. జిల్లాలో మొత్తం 1,14,448 మంది రైతులు ఉన్నారు. వీరిలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకున్న వారు 1,13,702 మంది ఉన్నారు. 1,13,701 మంది వివరాలను ట్రెజరీకి పంపించారు. ఇప్పటివరకు 1,11,953 మంది రైతులకు రూ.177,35,84,563 నగదు ఖాతాల్లో జమ అయింది. ఇంకా 1,748 మంది పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
అప్పుల కోసం తిప్పలు..
పంటల సాగుకు పెట్టుబడి సాయం ఉపయోగపడుతుందని ఆశగా ఉన్న రైతులకు నిరాశే ఎదురైంది. వానాకాలం సీజన్‌లో ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు అందింది. యాసంగిలో మాత్రం జిల్లాలో 1,748 మంది ఖాతాల్లో జమ కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వానాకాలంలో భారీ వర్షాలు, వరదలతో పంటలు కొట్టుకుపోగా మరోసారి విత్తనాలు విత్తుకోవాల్సి వచ్చింది. అధిక వర్షాలతో దిగుబడి కూడా ఆశించిన రీతిలో రాలేదు. ఇప్పటి వరకు రైతుబంధు పథకం కింద అందించే ెపెట్టుబడి సాయం రైతులకు ఎప్పుడు జమ చేస్తారో అనే దానిపై వ్యవసాయశాఖ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. రైతులు మాత్రం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం కటాఫ్ చేసిందో కూడా స్పష్టమైన సమాచారం లేదు. దీంతో రైతులు మరింత అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి పెట్టుబడిసాయం ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.