
టీచర్లకు శిక్షణ షురూ
● ఎస్జీటీలకు మండల కేంద్రాల్లో.. ● స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలో నిర్వహణ ● ఈ నెల 24 వరకు ప్రక్రియ
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభమైంది. ఈ నెల 13 నుంచి 17 వరకు జిల్లా కేంద్రంలో డీఆర్‌పీలు(జిల్లా రిసోర్స్‌పర్సన్లు) ఎంఆర్పీ(మండల రిసోర్స్‌పర్సన్లు)లకు శిక్షణ కల్పించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి ఎంఆర్పీలు ఉపాధ్యాయులకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రంలో.. ఎస్టీజీలకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఈవీఎస్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఐదోరోజు పాఠ్యాంశాయేతర అంశాలు అంటే పాఠశాలలో రికార్డుల నమోదు, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి, ప్రవేశాల పెంపు తదితర అంశాల గురించి వివరించనున్నారు.
1,663 మంది టీచర్లకు..
జిల్లాలోని 15 మండలాల్లో 738 ప్రభుత్వ పాఠశాలలు(లోకల్ బాడి) ఉన్నాయి. మొత్తం 1,663 మంది ఉపాధ్యాయులకు (528 మంది ఎస్‌ఏలు, 1,135 మంది ఎస్జీటీలు) శిక్షణ ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల, ఆశ్రమ ఉన్నత పాఠశాల(బాలికలు), జిల్లా పరిషత్ జన్కాపూర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)లలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఇక స్కూల్ గ్రేడ్ టీచర్లకు 15 మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. మండల కేంద్రాల్లో ఎమ్మార్సీలు శిక్షణ ఇస్తుండగా.. ఎంఈవోలు పర్యవేక్షిస్తున్నారు. భోజన వసతి కోసం ఒక్కో టీచర్‌కు ప్రభుత్వం రోజుకు రూ.200 అందిస్తోంది. ఉపాధ్యాయులు గైర్హాజరు కాకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. డీఈవోతో పాటు అకాడమిక్ మానిటరింగ్ అధికారులు ఇప్పటికే పలుమార్లు జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి మండల విద్యాధికారులకు విధివిధానాలు తెలియజేశారు. ఉపాధ్యాయులు గైర్హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తొలిరోజు వందశాతం మంది టీచర్లు హాజరయ్యారు.
గుణాత్మక విద్యనందించడమే లక్ష్యం
విద్యార్థుల్లో తగిన సామర్థ్యాలు పెంచడంతోపాటు గుణాత్మక విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగుతోంది. టీచర్లు సకాలంలో తరగతులకు హాజరై, అన్ని అంశాలపై అవగా హన పెంచుకోవాలి. ఏఐ బోధనకు సిద్ధం కావాలి.
– ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్

టీచర్లకు శిక్షణ షురూ