
పులి చర్మం, గోళ్లు స్వాధీనం
● పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం ● ఎఫ్‌డీపీటీ శాంతారాం
కాగజ్‌నగర్‌టౌన్: పెంచికల్‌పేట్ అటవీ రేంజ్ పరిధిలో ఐదురోజుల క్రితం వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృతి చెందిన పెద్దపుల్లి చర్మం, గోళ్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్‌నగర్ ఫారెస్టు డివిజన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎఫ్‌డీపీటీ శాంతారాం వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు విద్యుత్ వైర్లతో ఉచ్చు ఏర్పాటు చేసి పులిని హతమార్చారని తెలిపారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. దహెగాం మండలం చిన్న రాస్పెల్లి గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో పులిచర్మం, గోళ్లు, దంతాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మృత్యువాత పడిన పులి చారలు, వయస్సు ఆధారంగా కే8 పెద్దపులిగా ప్రాథమికంగా నిర్ధారించామని, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. వేటగాళ్లు ఉచ్చు బిగించిన ప్రాంతంలో గతంలో గ్రామం ఉండేదని, ప్రస్తుతం వేరే ప్రాంతానికి తరలిపోయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలు తీయకపోవడంతో కరెంట్ తీగల ద్వారా ఉచ్చును ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడిందన్నారు. విద్యుత్ స్తంభాలు ఆ ప్రాంతం నుంచి తొలగించాలని గతంలో కూడా విద్యుత్ శాఖ అధికారులకు సూచించామని తెలిపారు. అనుమానితులను లోతుగా విచారిస్తున్నామని, మరో రెండురోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవార్, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.