
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు వర్షాకాలం ప్రారంభంలోగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద చేపట్టిన పనులు జూన్ 11లోగా పూర్తి కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థుల సౌకర్యం కోసం తాగునీరు, మరుగుదొడ్లు, పెయింటింగ్, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, హౌసింగ్ డీఈ వేణుగోపాల్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకర్లు రుణలక్ష్యాలు సాధించాలి
ఆసిఫాబాద్‌రూరల్: బ్యాంకర్లు తమకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డీఆర్‌డీవో దత్తారావు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రాజేశ్వర్‌జోషితో కలిసి బుధవారం వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి సిబిల్ స్కోర్ పరిశీలించి నివేదిక అందించాలన్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,233 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు.