
కుప్పల వద్ద రైతుల తిప్పలు
● అకాల వర్షానికి తడిసిన ధాన్యం
దహెగాం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం బస్తాలు చూపుతున్న ఈ రైతు పేరు చపిలె దేవాజీ. మంగళవారం సుమారు 150 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పెట్టారు. కాంటా పూర్తయినా మిల్లుకు తరలించకపోవడంతో బుధవారం అకాల వర్షానికి బస్తాలన్నీ తడిచిపోయాయి. ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆగమాగమైందని ఆవేదన వ్యక్తం చేశాడు.
దహెగాం/పెంచికల్‌పేట్/కౌటాల: యాసంగిలో ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి ధాన్యం వర్షార్పణం అవుతోంది. అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నెలలపాటు కష్టపడి పండించిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతోంది. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం, రెండు రోజులుగా ఆకాశం మబ్బులు పట్టిఉండటంతో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత దహెగాం మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పూర్తయినా లారీలు రాకపోవడంతో బస్తాలు కదలడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రిపూట అంధకారంలో గడిపారు. పెంచికల్‌పేట్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కాపాడుకోవడానికి రైతులు టార్పాలిన్లు కప్పారు. గాలి దుమారానికి కవర్లు కొట్టుకుపోయి ధాన్యం తడిసింది. కౌటాల మండలంలో సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాండ్‌గాం, వీరవెల్లి, కౌటాల, ముత్తంపేట, గుడ్లబోరి గ్రామాల్లో నూర్పిడి చేసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. వీరవెల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తడవకుండా కవర్లు కప్పడానికి రైతులకు తిప్పలు తప్పలేదు. మూడు రోజులుగా సాయంత్రం మబ్బులను చూసి ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకోవడం, ఉదయం మళ్లీ ఎండకు తీయడం ఇబ్బందిగా మారింది. గురుడుపేట సహకార సంఘం ఆధ్వర్యంలో కౌటాల, ఐకేపీ ఆధ్వర్యంలో సాండ్‌గాం, వీరవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇటీవలే ప్రారంభించారు. సరిపడా స్థలం లేకపోవడంతో రైతులు ఇళ్ల వద్దనే ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు.

కుప్పల వద్ద రైతుల తిప్పలు

కుప్పల వద్ద రైతుల తిప్పలు