
● జిల్లాలో 39 కేంద్రాలు ఏర్పాటు ● విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో అశోక్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈవో అశోక్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ న పలు విషయాలు వెల్లడించారు. జిల్లాలో 39 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వార్షిక ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలో మెరుగైన స్థితిలో నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సాక్షి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరు కానున్నారు.. ఏఏ మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు?
డీఈవో: 6,893 మంది పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 39 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆసిఫాబాద్‌లో 6 కేంద్రాలు, కాగజ్‌నగర్‌లో 8, సిర్పూర్(టి)లో 4, జైనూర్, కెరమెరి, సిర్పూర్(యూ), రెబ్బెన, వాంకిడి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, చింతలమానెపల్లిలో 2 చొప్పున, పెంచికల్‌పేట్, రెబ్బెన, తిర్యాణిలో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశాం. జిల్లాలోని 40 ప్రైవేట్ స్కూళ్ల నుంచి 1,073 మంది విద్యార్థులు, 15 కేజీబీవీల నుంచి 524 మంది, 37 ఆశ్రమ పాఠశాలల నుంచి 1,247 మంది, 56 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,366 మంది, రెండు మోడల్ స్కూళ్ల నుంచి 191మంది, 19 గురుకులాల నుంచి 1,492 మంది పరీక్షలు రాయనున్నారు.
సాక్షి: ఈ ఏడాది పరీక్షల తీరు ఎలా ఉండనుంది?
డీఈవో: గతంలో మాదిరి కాకుండా 11 పేపర్లకు బదులు ఈ ఏడాది 6 పేపర్లు మాత్రమే ఉంటాయి. 80 మార్కులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్ష ఉంటుంది. సైన్స్ పరీక్ష రోజు అదనంగా 20 నిమిషాల సమయం ఇస్తారు. నిమిషం నిబంధనకు బదులు ఐదు నిమిషాల నిబంధన ఉంటుంది. విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
సాక్షి: వేసవి నేపథ్యంలో కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు?
డీఈవో: వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తాగునీటి, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. వైద్యసిబ్బంది, ఏఎన్‌ఎంలు కూడా సెంటర్ల వద్ద అందుబాటులో ఉంటారు. ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా అదనంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సాక్షి: ఆరు పేపర్ల విధానంపై విద్యార్థులను ఎలా సన్నద్ధం చేశారు?
డీఈవో: జనవరి నాటికే వందశాతం సిలబస్ పూర్తిచేశాం. ప్రతిరోజూ విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి, ప్రతీవారం పరీక్షలు పెట్టాం. అలాగే రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి, ఫోన్‌ఇన్ కార్యక్రమంలో ఆరు పేపర్ల విధానంపై అవగాహన కల్పించాం. గతేడాది కంటే ఈ సారి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.
సాక్షి: మాస్ కాపీయింగ్‌ను ఎలా అడ్డుకుంటారు?
డీఈవో: ప్రతీ ఎగ్జామ్ సెంటర్ సీసీ కెమెరాల నిఘా పరిధిలో ఉంటుంది. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా 39 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 400 మంది ఇన్విజిలేటర్లు, రెండు డిపార్ట్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేశాం. అలాగే కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను పర్యవేక్షిస్తాం. సెంటర్ల వద్ద 144 అమలులో ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం.
సాక్షి: మెరుగైన గ్రేడ్ల సాధనకు మీరిచ్చే సలహాలు..
డీఈవో: విద్యార్థులు 20 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. భయం లేకుండా పరీక్షలు రాయాలి. అలసట లేకుండా ఉండేందుకు పౌష్టికారం తీసుకుంటూ, సరిపడా నిద్రపోవాలి. ఒత్తిడి, భయాందోళనకు గురికాకుండా ప్రశ్నలను అర్థం చేసుకుని జవాబులు రాస్తే మెరుగైన గ్రేడ్లు సాధించవచ్చు.
