
ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న మహిళలు
జన్నారం: నీటి సమస్య పరిష్కరించాలని మండలంలోని పొనకల్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన మహిళలు మంగళవారం రామాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వీరికి కాంగ్రెస్, సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 20 రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నల్లాలు బిగించి ట్యాంక్ నుంచి నీరు సరఫరా చేయడం లేదని వాపోయారు. ఎండలు ముదురుతుండగా నీటి సమస్య ఎక్కువైందని తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య పరిష్కరించేదాకా ఆందోళన విరమించబోమని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై సతీశ్ అక్కడికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. కాగా, రెండురోజుల్లో నీటి సమస్య పరిష్కరిస్తామని ఎంపీపీ సరోజన ఫోన్‌లో హామీ ఇవ్వగా వారు రాస్తారోకో విరమించారు. వివిధ పార్టీల నాయకులు ఫసీఉల్లా, రాజన్న, కాలనీవాసులు రాజన్న, సందకృష్ణ, మల్లయ్య, చిలువేరు గంగమణి, పిల్లి సుజాత, సంద వనిత, మహిళలు పాల్గొన్నారు.