నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

Jun 21 2026 12:55 AM | Updated on Jun 21 2026 12:55 AM

● ఖమ్మంలో ఏడు పరీక్ష కేంద్రాలు ● మూడు గంటల ముందు నుంచే అనుమతి

ఏర్పాట్లు పూర్తి..

● ఖమ్మంలో ఏడు పరీక్ష కేంద్రాలు ● మూడు గంటల ముందు నుంచే అనుమతి

ఖమ్మంసహకారనగర్‌: వైద్య విద్య(యూజీ)లో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే ‘నీట్‌’ ఆదివారం జరగనుంది. గతంలోనూ పరీక్ష నిర్వహించినా పేపర్‌ లీకేజీ అయినట్లు బయటపడడంతో రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఖమ్మం నగర పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,771 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందులో బాలురు 733 మంది, బాలికలు 2,038 మంది ఉన్నారు.

11 గంటల నుంచే అనుమతి

పరీక్ష మధ్యాహ్నం 2నుంచి నుంచి 5–15గంటల వరకు జరగనుంది. గతంలో 5గంటల వరకే పరీక్ష నిర్వహించినా, ఈసారి పదిహేను నిమిషాల సమయం పెంచారు. ఇక విద్యార్థులను కేంద్రాల్లోకి 11గంటల నుంచే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30 గంటల వరకే అనుమతి ఉంటుందని, ఆతర్వాత అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు విద్యార్థులు సమయానికి చేరుకోవాలని సూచించారు. అలాగే, గతంలో మాదిరిగానే జ్యూయెలరీ, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి ఉండదని, మెటల్‌ బటన్లు, హుక్‌లు ఉన్న దుస్తులు వేసుకురావొద్దని, పాదాలను పూర్తిగా మూసివేసే బూట్లు వంటివికాకుండా స్లిప్పర్లు మాత్రమే ధరించాలని అధికారులు సూచించారు. అలాగే, విద్యార్థులు నీట్‌ హాల్‌టికెట్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఒక పోస్ట్‌ కార్డ్‌ సైజ్‌ ఫొటో, గుర్తింపు కార్డు తీసుకుకురావాలని తెలిపారు.

కేంద్ర బలగాలతో బందోబస్తు

నీట్‌ కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే ఓసారి పరీక్ష రద్దయిన దృష్ట్యా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు కేంద్రాల వద్ద సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌తో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, ప్రశ్నపత్రాలు తీసుకురావడం, పరీక్ష పూర్తయ్యాక తీసుకెళ్లే వాహనాలకు కూడా కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తారు. కాగా, పలు పరీక్ష కేంద్రాలను ఖమ్మం వన్‌ టౌన్‌, టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్‌, బాలకృష్ణ శనివారం పరిశీలించి సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. కేంద్రాల సమీపాన ఆంక్షలు అమల్లో ఉంటాయని, పరిసరాలలోని ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు.

నీట్‌ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్ష సమయం గతం కన్నా 15నిముషాలు అదనంగా ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1–30గంటల వరకు అనుమతిస్తాం. ఈ విషయాన్ని గుర్తించి సకాలంలో క్షకేంద్రాలకు చేరుకోవాలి.

– నరేంద్రకుమార్‌, పరీక్షల సిటీ కన్వీనర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement