సత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనంపై పెట్టి ఉన్న ఇనుప పైపులు పడడంతో బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం సిద్ధారంలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్ధారం గ్రామానికి చెందిన తడికమళ్ల రాజేశ్ – సంతోషి కుమారుడు చైతన్య (20 నెలలు)ను ఇంటి ముందు గంధం రాములు ఇంట్లో ఆడుకునేందుకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడు ఆడుకుంటూ బైక్ దగ్గరకు వెళ్లాడు. అది ఒరగడంతో వాహనానికి పెట్టి ఉన్న 150 కేజీల బరువైన మోటార్లు తీసే చైన్ బ్లాక్ పైపులు చైతన్యపై పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు...
నకిరేకల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలికొండకు చెందిన ఆరిగోట్ల ప్రభాకర్(46) తన భార్య మమతతో కలిసి హైదరాబాద్‌లో తాము పనిచేస్తున్న ఏరియా మౌలాలీకి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం చందంపల్లి శివారు జాతీయ రహదారిపై ప్లైఓవర్ వంతెన వద్దకు రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో భార్యభర్తలకు తీవ్రగాయాలు కాగా ప్రభాకర్‌ను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.
డీజే శబ్దంతో అపస్మారక స్థితిలోకి..
తల్లాడ: బంధువుల ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా డీజే శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తం కట్టిందని చెప్పడంతో కుటుంబీకులు చికిత్సకు చేతిలో నగదు లేక ఆవేదన చెందుతున్న ఘటన ఇది. తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీకాలనీకీ చెందిన 18 ఏళ్ల సంగసాని పార్థు సమీప బంధువు ఇంట్లో పెళ్లి సందర్భంగా గురువారం రాత్రి డీజే పాటలకు మరికొందరు యువకులతో నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని, మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచనతో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇప్పటికే చికిత్సకు రూ.50 వేలు వరకు ఖర్చవగా, మరో రూ.6 లక్షలు అవుతుందని చెప్పడంతో నిరుపేదలైన పార్థు కుటుంబీకులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. డీజే శబ్దం తీవ్రతే పార్థు అనారోగ్యానికి కారణమని తెలుస్తుండగా, రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబం కావడంతో చికిత్స కోసం దాతలు చేయూతనివ్వాలని కోరుతున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 50 గోవుల పట్టివేత
తిరుమలాయపాలెం: బక్రీద్ నేపథ్యాన గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కాగా, లారీ, వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 50 గోవులను పట్టుకున్నారు. మండలంలోని సుబ్లేడు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు సమీపాన తిరుమలాయపాలెం ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్, సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఖమ్మం నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న లారీ, వ్యాన్‌లో 50 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్, ఏపీకి చెందిన వాహనాల డ్రైవర్లు షేక్ జమీల్, కోన ముస్లీతో పాటు పశువులను తరలిస్తున్న శేఖర్‌గౌడ్‌ను అరెస్ట్ చేసి గోవులను పండితాపురం తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రాణాపాయం


