ఎండల వేళ జాగ్రత్తలు
● ఈనెల కూడా పాత పేరుతోనే పథకం కొనసాగింపు ● జిల్లాకు 10 లక్షల నుండి 15 లక్షల పనిదినాలు ● ఎండల దృష్ట్యా ఉదయమే చేపట్టేలా చర్యలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపులో పని దినాల లక్ష్యంతో దాటితే పనులు ఆగిపోయే ప్రమా దం ఏర్పడుతుంది. ఈసారి కూడా అలాగే జరగడం, ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పుల అమలుకు సమయం పట్టనుండడంతో ఏప్రిల్ నెలలో కూడా పాత పేరుతో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏప్రిల్ కోసం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 2.5 కోట్ల పనిదినాలను కేటాయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి దక్కనుంది.
జిల్లాలో భారీగా డిమాండ్
వ్యవసాయ పనులు లేకపోవడంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత కూలీలంతా ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నారు. దీంతో జిల్లాలో ఏప్రిల్‌కు దాదాపు 20 లక్షలకు పైగా పనిదినాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన పనిదినాల ప్రకారం జిల్లాకు 10 లక్షల నుండి 15 లక్షల పనిదినాలు కేటాయించే అవకాశం ఉంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా వీబీ–జీరాం చట్టం అమలు కానుండగా, ప్రస్తుతం ఉన్న మిగిలిపోయిన నిధులతోనే పనులను కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం. ఈనెల కూడా పాత పథకమే కొనసాగనున్న దృష్ట్యా వేలాది మంది పేద కుటుంబాలకు ఉపాధి లభించడమే కాకుండా, పెండింగ్ పనుల పూర్తికి అవకాశం కలుగుతుంది.
బిల్లుల చెల్లింపులపై దృష్టి
ఉపాధి హామీ పథకానికి మార్పులు జరగనుండడంతో అధికారులు పాత బిల్లులపై దృష్టి సారించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పూర్తి చేయించడమే కాక పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపు వేగవంతం చేశారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా పాత రికార్డులను క్లియర్ చేయడానికి పొడిగించిన నెల సమయం అధికారులకు కీలకం కానుంది.
ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో కూలీల ఆరోగ్య దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎండ తీవ్రత పెరగకముందే ఉదయం పూట పనులు ముగించేలా ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచనలు చేస్తున్నారు. అంతేకాక పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్లు ఏర్పాటుచేయడమే కాక తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సమకూరుస్తున్నారు. అదనపు పనిదినాలకు సంబంధించి నిధులు కూడా వెంటనే విడుదలయ్యేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఉండబోదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


