నేలకొండపల్లి: మండల కేంద్రంలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు హోటళ్లలో వాణిజ్య సిలిండర్లకు బదులు గృహోపయోగ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఆరు సిలిండర్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్సై రఘు తెలిపారు.
శ్రీరాంనగర్‌లోని రెండు ఇళ్లలో చోరీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 16వ డివిజన్ శ్రీరాంనగర్ రోడ్డునంబర్ 14లోని రెండు ఇళ్లలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కాలనీ నివసిస్తున్న దండా విక్రమ్, దుర్గాల రవితేజ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించి బైక్‌పై వచ్చిన దుండగులు అర్ధరాత్రి 2:45 గంటలకు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ముగ్గురు వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, దండా విక్రమ్ నివాసంలో రూ.14 వేల నగదు చోరీ జరగగా, రవితేజ కుటుంబం వచ్చాక చోరీ విషయమై స్పష్ట రానుంది. ఈమేరకు ఖమ్మం అర్బన్ ఎస్‌ఐ మధుబాబు, క్లూస్ టీమ్ సభ్యులు శనివారం ఉదయం రెండు ఇళ్లలో పరిశీలించి ఆధారాలు సేకరించారు.
మాయమాటలతో బాలికను తీసుకెళ్లిన వ్యక్తి
కారేపల్లి: మాయమాటలు చెప్పిన వివాహిత వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటూ ఓ బాలికను తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 38ఏళ్ల హరికి వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. ఈనేపథ్యాన గ్రామానికే చెందిన ఇంటర్ విద్యార్థికి మాయమాటలు చెప్పి ఈనెల 2వ తేదీ రాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఎక్కడ వెతికినా జాడ లేకపోవడంతో కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శనివారం ఆమె ఆచూకీ తెలియడంతో గ్రామానికి తీసుకురాగా పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడే ఉన్న బాలిక కుటుంబ సభ్యులు నిందితుడిపై దాడికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు కారేపల్లి ఎస్‌ఐ బి.గోపి తెలిపారు.


