నేలకొండపల్లి: గురుకుల పాఠశాలలో ఏర్పడిన స్నేహాన్ని మరిచిపోకుండా.. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితుడిని కలిశాడు. మండలంలోని అప్పలనరసింహాపురానికి చెందిన రాయల రామయ్య, ఏన్కూరుకు చెందిన కె.కిరణ్‌కుమార్ దమ్మపేట గురుకుల పాఠశాలలో ఐదు నుంచి పదో తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లగా కిరణ్‌కుమార్ ఐపీఎస్‌గా ఎంపికై ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలోని గయా జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన రామయ్య అప్పలనరసింహాపురంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాడని తెలిసి శుక్రవారం వచ్చాడు. రోజంతా స్నేహితుడు, ఆయన కుటుంబంతో సరదాగా గడిపారు. అంతేకాక గ్రామ యువత, విద్యార్థులతో మాట్లాడి చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చని, విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు కష్టపడాలని సూచించారు. అనంతరం కిరణ్‌కుమార్‌ను స్థానికులు సన్మానించారు. కార్యక్రమంలో మేరుగు పుల్లయ్య, అశోక్, చిట్టిబాబు, సంజీవ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


