హక్కుల వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

హక్కుల వైపు అడుగులు

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

ఐదేళ్లకు పైగా పెండింగ్‌

జిల్లాలో 1,11,443 దరఖాస్తులకు మోక్షం

జిల్లాలో అత్యధిక దరఖాస్తులు ఉన్న మండలాలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్ని చట్టాలు తెచ్చినా సాదాబైనామా సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు దీనికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వం జీఓ 76 విడుదల చేయడంతో తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన భూముల క్రమబద్ధీకరణ సాఫీగా జరగనుంది. జిల్లాలో పెండింగ్‌ ఉన్న 1,11,443 దరఖాస్తులకు పరిష్కారం లభించనుండగా.. సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

భూభారతిలోనూ సమస్య

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో సాదాబైనామా దరఖాస్తుల కోసం సెక్షన్‌ 6, రూల్‌ 6లో నిబంధనలు పొందుపరిచింది. దీని ప్రకారం ఆర్డీఓలు క్షేత్ర స్థాయిలో విచారించి భూమి చుట్టుపక్కల రైతులతోనూ మాట్లాడి రాతపూర్వక ఆధారాలను పరిశీలించాలి. పీఓటీ, సీలింగ్‌, ఎల్‌టీఆర్‌ చట్టాల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొనుగోలుదారుడు, అమ్మకందారుడి అఫిడవిట్లు ఇవ్వాలన్న నిబంధనతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ కారణంగా భూభారతి చట్టంలోనూ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు.

ఒకరు ఇస్తే చాలు..

భూముల క్రమబద్ధీకరణ కోసం 2014 జూన్‌ 2కు పూర్వం తెల్లకాగితాలపై రాతకోతలు సాగించిన వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వాలు మారినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో భూమి అమ్మకం, రుణానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ఈనెల 18న జీఓ 76 విడుదల చేసింది. ఈ జీఓ ద్వారా కొనుగోలుదారుడు మాత్రమే ఆఫిడవిట్‌ ఇస్తే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు.

ఎలా చేస్తారంటే..

సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన అంతా ఆర్డీఓల నేతృత్వాన జరగనుంది. 2014 జూన్‌ 2 కన్నా ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, 12ఏళ్ల పాటు భూమి అనుభవంలో ఉన్నట్లు చూపాలి. సన్న, చిన్నకారు రైతులు అంతేకాక 2020 అక్టోబర్‌ 12 నుంచి 2020 నవంబర్‌ 10 మధ్య అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్డీఓ నేతృత్వాన క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్‌, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్‌ జారీ చేయనున్నారు. ఆతర్వాత హక్కుల రికార్డులో నమోదు చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారు.

ఏళ్ల క్రితం భూ క్రయవిక్రయాలు సందర్భంగా తెల్లకాగితాలపైనే రాతకోతలు సాగేవి. అయితే, భూములపై చట్టబద్ధత, హక్కుల్లో ఇబ్బంది ఎదురవుతుండడంతో క్రమబద్ధీకరించాలని 2016 ఏడాదిలో నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం 112 జీఓ ద్వారా మరోసారి మీ సేవ కేంద్రాల్లో ఫారం 10 ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఆ ఏడాది అక్టోబర్‌ 31తో గడువు ముగిసినా.. ఆ తర్వాత నవంబర్‌ 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అప్పుడు మొత్తం 1,11,443 దరఖాస్తులు వచ్చాయి. కానీ ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు నిబంధనలు పొందుపర్చకపోవడం, హైకోర్టు స్టే విధించడంతో దరఖాస్తులన్నింటికీ పక్కన పెట్టారు.

జీఓ 76తో ‘సాదాబైనామా’లకు తొలగిన చిక్కులు

కొనుగోలుదారుడి అఫిడవిట్‌ ఉంటే క్రమబద్ధీకరణ

మండలం దరఖాస్తులు

పెనుబల్లి 14,333

కల్లూరు 8,314

కొణిజర్ల 7,846

తిరుమలాయపాలెం 7,607

కూసుమంచి 7,193

వేంసూరు 6,791

సింగరేణి 6,681

ఏన్కూరు 6,179

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement