యాదవ ప్రజాప్రతినిధుల సన్మానంలో కూరాకుల
ఖమ్మంఅర్బన్: ఐక్యంగా ఉంటూ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తూనే సమాజాభివృద్ధిలోనూ ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవాలని తెలంగాణ యాదవ మహాసభ వ్యవస్థాపకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సూచించారు. ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన యాదవ ప్రజాప్రతినిధులను మహాసభ ఆధ్వర్యాన సోమవారం ఖమ్మం మధురానగర్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. తద్వారా ప్రజల మన్ననలు పొందడమే కాక రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరొచ్చని చెప్పారు. జిల్లా కార్యదర్శి గుమ్మ రోశయ్య మాట్లాడుతూ యాదవ సమాజం ఐక్యంగా ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బీసీ సంఘం, కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకులు గుండాల కృష్ణ, అమరగాని వెంకన్న గౌడ్, డాక్టర్ బిశం వెంకటేశంయాదవ్, కోడి లింగయ్య, పగడాల నాగరాజు, మేకల సుగుణారావు, బారి మల్సూర్, చిత్తారు ఇందుమతి, ముక్కాల కమల, జడ మల్లేష్, మూడుముంతల గంగరాజు, మల్లీదు హైమావతి తదితరులు పాల్గొన్నారు.
తీరని గ్యాస్ కష్టాలు
వైరా: గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అవాంతరాలు లేవని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. వైరాలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లు సరిగా సరఫరా చేయడం లేదని వినియోగదారులు వైరా–జగ్గయ్యపేట రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏజెన్సీ నిర్వాహకులు ఎలాంటి సమాచారం లేకుండా గోదాంను మూసివేయడంతో వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. దీంతో వైరా ఆదనపు ఎస్‌ఐ పవన్ చేరుకుని వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. కాగా, వినియోగదారుల ఆందోళన విషయం తెలియడంతో సాయంత్రం డీసీఎస్‌ఓ చందన్‌కుమార్ కాణిపాకం గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సేల్స్ ఆఫీసర్‌తో ఫోన్‌లో మాట్లాడి మరో ఏజెన్సీ ద్వారా అయినా గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


