ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదు, వినతిపత్రాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఏదైనా దరఖాస్తులను తిరస్కరిస్తే స్పష్టమైన కారణాలు వెల్లడించాలని తెలిపారు. అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మ శ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
కామేపల్లి మండలం శివారు లల్లా తండా వాసులు తమ గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఖమ్మం రూరల్ మండలంలోని మున్నేటి వద్ద లంబాడీ పూర్వీకుల సమాధి స్థలాన్ని రక్షించాలని, ఇందుకోసం సర్వీస్ రోడ్డు, కాలువ డిజైన్ మార్చాలని నాయకులు శేఖర్‌నాయక్ వినతిపత్రం అందజేశారు. అలాగే, చింతకాని మండలం ప్రొద్దుటూరులో కుక్కల బెడదపై పి.నాగుల్ మీరా, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఖమ్మం కార్పొరేషన్ శ్రీరామ్‌నగర్ వాసులు కోరారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


