పోలీసులతో కుటుంబీకుల వాగ్వాదం, కార్పొరేటర్ బంధువుపై దాడి
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని మున్నేరులో పడి ఓ బాలుడు మృతి చెందగా.. మృతదేహం పోస్టుమార్టానికి నిరాకరించిన కుటుంబీకులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. దీనికి తోడు బాలుడి మృతికి అధికార పార్టీ కార్పొరేటర్ మరిదే కారణమని ఆయన ఇంటిపై దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. ఖమ్మం సుందరయ్యనగర్‌కు చెందిన బత్తుల క్రాంతికుమార్ కుమారుడు హదృత్య(9) అలియాస్ బిట్టూ ఆదివారం స్నేహితులతో కలిసి పంపింగ్‌వెల్ రోడ్డులోని మున్నేటిలో ఈతకు వెళ్లాడు. అక్కడ ప్రమాదశశాత్తు గుంతలో మునిగిపోగా, స్నేహితులు ఇచ్చిన సమాచారం కుటుంబీకులు బయటకు తీసేసరికి మృతి చెందాడు.
కార్పొరేటర్ మరిదిపై దాడి
పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతంలో కరకట్ట నిర్మాణం జరుగుతుండగా తన పొలం పోతోందని అధికార పార్టీ కార్పొరేటర్ మరిది తోట వెంకటరమణ కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. ఒకవేళ కరకట్ట నిర్హాణం జరిగితే బాలుడు మున్నేటిలోకి వెళ్లేవాడు కాదంటూ ఆగ్రహించిన ఆయన కుటుంబీకులు ఆదివారం రాత్రి వెంకటరమణపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టారు. ఆపై సోమవారం ఉదయం బాలుడి మృతదేహనికి పోస్ట్‌మార్టం చేయించేందుకు సిద్ధం కాగా, కుటుంబీకులు వాగ్వాదానికి దిగారు. చివరకు త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు వారికి సర్దిచెప్పి మృతదేహన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలుడి అంత్యక్రియలకు స్థానికులు పెద్దసంఖ్యలో రావడంతో బందోబస్తు చేశారు. కాగా, బిట్టూ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు.


