ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు అప్రెంటిస్ షిప్ డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్ గ్రాఫిక్ డిజైన్–డిజిటల్ అడ్వర్‌టైజింగ్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉండగా, డిగ్రీ చదువుతూనే పరిశ్రమల్లో పని అనుభవం, స్టైఫండ్ పొందేలా వీటిని రూపొందించినట్లు వెల్లడించారు.
టీపీహెచ్‌డీఏ
నూతన కార్యవర్గం ఎన్నిక
ఖమ్మంవైద్యవిభాగం: తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం(టీపీహెచ్‌డీఏ) జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా జనరల్ ఆస్పత్రి ఆర్‌ఎంఓ టి.శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా ఎన్.బాలకృష్ణ, కోశాధికారిగా బి.అర్జున్ గౌతమ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ అమన, సాయిలుతో పాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీకాంత్‌ను గురువారం జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, ఉద్యోగులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య సేవలు మరింత బలోపేతమయ్యేలా కృషి చేయడంతో పాటు వైద్యుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాడతానని తెలిపారు.
పీఎం ఇంటర్న్‌షిప్
పథకానికి దరఖాస్తులు
ఖమ్మం అర్బన్: కేంద్రప్రభుత్వం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన అమలుచేస్తున్న పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి అర్హులై న యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరి శ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.సీతారాం సూచించారు. ఈ పథకం ద్వారా యువతకు దేశవ్యాప్తంగా రెండువేల కంపెనీల్లో సీఎస్‌ఆర్ ద్వారా శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని తెలి పారు. ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 6–9 నెలలు ఉండగా, ఎంపికై తే నెలకు గరిష్టంగా రూ.9వేల స్టైఫండ్, ఒకసారి రూ.6వేల గ్రాంట్ అందుతుందని పేర్కొన్నారు. ఈమేరకు 18–25 ఏళ్ల వయస్సు కలిగి ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ చదివిన, చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండాలని వెల్లడించారు. సెల్ నంబర్, ఈ మెయిల్, బ్యాంకు ఖాతాకు లింక్ అయిన ఆధార్ నెంబర్, మార్కుల మెమోలతో అధికా రిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీఎం సూచించారు. అభ్యర్థులు మూడు ఇంటర్న్‌షిప్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా, వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 1800 11 6090లో సంప్రదించాలని ఆయన తెలిపారు.


