తిరుమలాయపాలెం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి దశ నిర్మాణం చేపట్టడంలో ఆర్థిక సమస్యలు ఎదురైతే మహిళా సంఘాల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. తద్వారా దశల వారీగా నిర్మాణం పూర్తిచేస్తుంటే ప్రభుత్వం నుంచి రూ.5లక్షల నగదు అందుతుందని చెప్పారు. తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు ఆరాతీస్తూ త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ తిరుమలాయపాలెం మండలంలో 802 ఇళ్లు మంజూరు చేయగా, 736 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పునాది స్థాయి నిర్మించుకోలేని వారికి వారికి మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ విషయంలో అధికారులు అవగాహన కల్పిస్తూ గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ చూపాలని సూచించారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, హౌజింగ్ డీఈ జగ్రాం, ఏఈ నవ్య, సర్పంచ్ ఇస్లావత్ సునీత, పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


