సరుకు భళా.. ధర డీలా! | - | Sakshi
Sakshi News home page

సరుకు భళా.. ధర డీలా!

Feb 16 2026 7:35 AM | Updated on Feb 16 2026 7:35 AM

సరుకు భళా.. ధర డీలా!

సరుకు భళా.. ధర డీలా!

● మిర్చి పెరుగుతుండడంతో ధర తగ్గుముఖం ● 20 రోజుల్లో క్వింటాకు రూ.2,300 తగ్గిన ధర

రూ.20వేల నుంచి కిందకు..

● మిర్చి పెరుగుతుండడంతో ధర తగ్గుముఖం ● 20 రోజుల్లో క్వింటాకు రూ.2,300 తగ్గిన ధర

ఖమంవ్యవసాయం: మిర్చి విక్రయాలు పెరుగుతుండగా.. ధరపై ప్రభావాన్ని చూపిస్తోంది. మిర్చి సీజన్‌ కొద్ది రోజులుగా ఊపందుకోగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నిత్యం 30వేల బస్తాల వరకు విక్రయానికి తీసుకొస్తున్నారు. గత శుక్రవారం 40వేల బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. అంతేకాక శనివారం వారాంతపు సెలవైనా వరుస సెలవుల నేపథ్యాన మార్కెట్‌ నిర్వహించగా 15వేల బస్తాల మిర్చి తీసుకొచ్చారు. ఇక్కడి మార్కెట్‌లో ‘తేజా’ రకం మిర్చి కొనుగోళ్లకు పేరు ఉండడంతో జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు సరుకు తీసుకొస్తున్నారు. ఖమ్మం వ్యాపారులు ఈ మిర్చిని కొనుగోలు చేసి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే, చైనాలో ఈ రకం మిర్చి సాగుతో ఆర్డర్లు లేక ధరపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దేశీయంగా డిమాండ్‌ మేరకు మిర్చి కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే, సీజన్‌ కావడంతో సరుకు పెరుగుతుండగా క్రమంగా ధర తగ్గుతుండడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.

ఖమ్మం మార్కెట్‌లో మిర్చి ధర ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2,300 మేర తగ్గింది. జనవరి 23న రూ.20 వేలు పలికిన ధర ఎంతోకాలం నిలవలేదు. ఈనెల మొదటి వారంలో రూ.19,700 పలకగా, ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. ఈనెల 6న రూ.19వేలు, 10–12వ తేదీ వరకు రూ.18,700గా నమోదైన ధర శనివారం రూ.18,400కు పడిపోయింది. జెండాపాట ధర రూ.18,400 పలికినా మోడల్‌ ధర రూ.17,500తోనే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక కనిష్ట ధర రూ.10వేలకే పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement