‘మహాలక్ష్మి’కి రెండేళ్లు !
సురక్షితంగా గమ్యస్థానాలకు..
● రీజియన్‌లో 8.91కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం ● చార్జీల రూపంలో రూ.420 కోట్లు ఆదా
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు నిండాయి. మహిళా ప్రయాణికులకు వరంలా మారిన ఈ పథకం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గింది. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటివరకు రెండేళ్లలో ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా మహిళలకు టికెట్ల రూపంలో రూ.420.05 కోట్లు ఆదా అయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
భారీ స్థాయిలో ప్రయాణాలు
మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గ్రామాల నుండి వివిధ పనులు, ఉపాధి నిమిత్తం పట్టణాలు, నగరాలకు వెళ్లే మహిళలు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. కూలీలు, చిరు ఉద్యోగులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పథకం వారికి ఊరటగా మారింది. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో గత రెండేళ్లలో ఏకంగా 8.91 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విని యోగించుకున్నారు. రోజుకు సగటున 1,23,605 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. తద్వారా వారికి చార్జీలు ఆదా అవుతుండగా, ఈ నగదును నిత్యావసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా ఈ పథకం మహిళా ప్రయాణికులకు ‘ఆర్థిక స్వేచ్ఛ’ను ఇస్తోందని పలువురు అభివర్ణిస్తున్నారు.
సౌకర్యాల కల్పనపై దృష్టి
ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యాన బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యాన ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా బస్సులను సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం ద్వారానే స్వయం సహాయక సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన సంస్థకు అప్పగిస్తున్నారు. ఇక డ్రైవర్లు, కండక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తుండడంతో సిబ్బంది కొరత తీరుతోంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఉమ్మడి జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఆర్టీసీకి ఆదరణ పెరిగింది. మహిళా ప్రయాణికులతో పాటు ఇతరులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ఇదే సమయాన మరిన్ని సౌకర్యాలు కల్పించేలా సంస్థ చర్యలు చేపడుతోంది.
– ఏ.సరిరామ్, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్
‘మహాలక్ష్మి’కి రెండేళ్లు !


